Kerala: కరోనాను ఓడించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కేరళ వృద్ధ దంపతులు
- ఇటీవలే ఇటలీ నుంచి వారి కుమారుడి రాక
- కుమారుడి ద్వారా వృద్ధ దంపతులకు కరోనా వ్యాప్తి
- భర్త వయసు 93 ఏళ్లు, భార్య వయసు 88
- పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
కరోనా వైరస్ వృద్ధులను ఎక్కువగా కబళిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కేరళకు చెందిన ఓ వృద్ధ జంట మాత్రం కరోనాను ఓడించి దిగ్విజయంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. ప్రాణాంతక వైరస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్న ఆ జంట సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవడంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు.
పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంట ఇటీవలే కరోనాతో ఆసుపత్రిపాలైంది. వారిలో భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.