New Delhi: ఢిల్లీ మసీదుల్లో 600 మంది విదేశీయులు.. క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన పోలీసులు
- తబ్లిగీ జమాత్ కేంద్రం నుంచి ఇప్పటికే 2300 మందిని తరలించిన పోలీసులు
- ఢిల్లీ శివార్లలోని పలు మసీదుల్లో దాక్కున్న విదేశీయులు
- మసీదుల్లో తనిఖీల కోసం ప్రభుత్వ అనుమతి కోరిన పోలీసులు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిలో 600 మంది విదేశీయులు నగర శివారుల్లోని పలు మసీదుల్లో దాక్కున్నారని, వారిని పట్టుకుని క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అనుమతించాలని పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు.
తబ్లిగ్ జమాత్ కార్యాలయం నుంచి ఇప్పటికే 2300 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించిన పోలీసులు.. మరో 600 మంది నగర శివారులోని 16 మసీదుల్లో దాక్కున్నట్టు గుర్తించారు. వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సి ఉందని, కాబట్టి మసీదుల్లో తనిఖీలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరిలో ఢిల్లీ ఈశాన్య జిల్లాలోని మసీదుల్లో 100 మంది, ఆగ్నేయ జిల్లాలో 200 మంది, దక్షిణ జిల్లాలో 170 మంది, పశ్చిమ జిల్లాలో ఏడుగురు విదేశీయులు దాక్కున్నారని, మిగతా వారిని గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.