Lockdown: రైళ్ల పున:ప్రారంభంపై రైల్వే శాఖ కీలక ప్రకటన

 Railway Department announcement on resumption of trains
  • 12వ తేదీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • ఆన్‌లైన్ బుకింగ్స్ నిలిచిపోలేదని స్పష్టీకరణ
  • లాక్‌డౌన్ సమయంలో ప్రయాణాల బుకింగ్స్ మాత్రమే రద్దు
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలు చేయడంతో  ప్రజా రవాణా స్తంభించిపోయింది. గూడ్స్ మినహా ఇతర రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో  రైల్వే సేవల ప్రారంభం, టికెట్ల బుకింగ్‌పై రోజుకో వార్త బయటకొస్తోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది.

ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పున:ప్రారంభంపై ఈ నెల 12వ తేదీ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. అదే సమయంలో రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. 120 రోజుల ముందే టికెట్ల రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ముందు నుంచే ఉందని తెలిపింది. కేవలం లాక్‌డౌన్ అమల్లో ఉన్న తేదీల్లో (మార్చి 24 నుంచి ఏప్రిల్ 14) జరిగే ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ను రద్దు చేసినట్టు పేర్కొన్నది.  

మూడు నెలల ముందు నుంచే బుకింగ్స్ చేసుకునే సౌకర్యం ఉండడంతో వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే భారీ సంఖ్యలో అడ్వాన్స్ రిజర్వేషన్లు జరిగాయి. దూర ప్రాంత రైళ్లలో రిజర్వేషన్లకు ఇప్పుడు ‘నో రూమ్‌’ అని వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే తాము ఒక నిర్ణయానికి వస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను నడిపే ఆలోచన చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.   
Lockdown
Indian Railways
announcement
resumption
trains

More Telugu News