Tollywood: సినీ కార్మికులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు, ఔషధాల పంపిణీ
- చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు
- లాక్ డౌన్ నేపథ్యంలో 24 విభాగాల వారిని ఆదుకునేందుకు ప్రయత్నం
- తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని సూచన
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కమిటీకి ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు రేపటి నుంచి సీసీసీ నిత్యావసర సరుకులు, ఔషధాలు అందజేయనుంది.
టాలీవుడ్ కి చెందిన మొత్తం 24 విభాగాల్లోని పేద సినీ కార్మికుల జాబితాను ఇప్పటికే సీసీసీ సిద్ధం చేసింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు తమ పేర్లను కమిటీలో నమోదు చేసుకోవాలని సీసీసీ సభ్యులు మరోపక్క సూచించారు. దీనిపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సీసీసీ కేవలం కరోనా కోసమే కాదని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటుందని, చిరంజీవి కూడా ఇది నిరంతరం పనిచేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్థాపించారని వెల్లడించారు.