USA: కరోనా తాజా అప్ డేట్... అమెరికాలో 3 లక్షలు దాటిన కేసులు!
- యూఎస్ లో మృతుల సంఖ్య 8,100
- న్యూయార్క్ లో లక్ష దాటిన పాజిటివ్ కేసులు
- సమీప భవిష్యత్తులో అత్యంత గడ్డు పరిస్థితులు
అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. వైరస్ ఆరంభంలోనే కఠిన చర్యలు తీసుకోలేకపోయిన యూఎస్, ఇప్పుడు ఆ ప్రభావాన్ని చూస్తోంది. దేశంలో మరణమృదంగం సృష్టిస్తున్న వైరస్, ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రజలను తాకింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 8,100 మందికి పైగా మరణించారు. ఇక వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న న్యూయార్క్ లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా, మృతుల సంఖ్య 3,565గా నమోదైంది.
ఇక ఇటలీలో మృతుల సంఖ్య 15,362కు చేరగా, స్పెయిన్ లో లాక్ డౌన్ ను 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యూఎస్ లో అధిక కేసులు నమోదుకాగా, అత్యధిక మరణాలు ఇటలీలో సంభవించాయి. కొన్ని దేశాలు కరోనా తాజాగా సోకిన వారి సంఖ్య ను గణనీయంగా తగ్గించగలిగాయి.
ముఖ్యంగా తైవాన్, కెనడా, సౌత్ కొరియా, ఐస్ లాండ్ తదితర దేశాల్లో కరోనా కొత్త బాధితుల సంఖ్య తగ్గిపోయింది. ఈ దేశాల్లో వైరస్ వ్యాప్తికి చేపట్టిన చర్యలను మిగతా దేశాలు అనుసరిస్తున్నాయి.
ఇదిలావుండగా, యూఎస్ లో సమీప భవిష్యత్తులో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనాల్సి వుంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. శరణార్థులు అధికంగా ఉంటున్న సిరియా, లిబియా, యెమన్ తదితర దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తే, కల్లోలమే రేగుతుందని ఆయన హెచ్చరించారు.