Air India: 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది... ఎయిర్ ఇండియాపై పాకిస్థాన్ ప్రశంసల జల్లు!
- ముంబై నుంచి ఫ్రాంక్ ఫర్ట్ బయలుదేరిన విమానాలు
- తమ గగనతలంలోకి స్వాగతం పలికిన కరాచీ ఏటీసీ
- ఆపై ఇరాన్ మీదుగా జర్మనీకి చేరుకున్న విమానాలు
భారత ప్రభుత్వ రంగ పౌరవిమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, కరోనా మహమ్మారి విస్తరించిన వేళ, ఇప్పటికే పలు దేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతూ, రిలీఫ్ మెటీరియల్ ను, చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి చేర్చేందుకు శ్రమిస్తూ, ఎన్నో దేశాల మన్ననలను అందుకుంది. తాజాగా, ఆ జాబితాలో పాకిస్థాన్ కూడా చేరిపోయింది. ఎయిర్ ఇండియాను చూస్తుంటే, తమకు చాలా గర్వంగా ఉందని, అనిశ్చిత స్థితి పెరిగిపోయిన నేపథ్యంలో ఆ సంస్థ అమోఘమైన కృషి చేస్తోందని కితాబిచ్చింది.
ఏప్రిల్ 2న ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు కరోనా రిలీఫ్ మెటీరియల్ ను తీసుకుని రెండు ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరాయి. నరేంద్ర మోదీ, టోటల్ లాక్ డౌన్ ను ప్రకటించిన తరువాత జర్మనీకి బయలుదేరిన తొలి విమానాలు ఇవే. ఈ విమానాలు ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టేకాఫ్ తీసుకుని, సాయంత్రం 5 గంటల సమయంలో పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లాయి.
"ఆ సమయంలో మేము పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో కాంటాక్ట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యాం. మారు ఏ విధమైన సమాధానమూ రాలేదు. ఆపై మేము ఫ్రీక్వెన్సీని మార్చుకుని ఏటీసీతో కాంటాక్ట్ లోకి వెళ్లాము. ఆ తరువాత పాకిస్థాన్ ఏటీసీ నుంచి వచ్చిన మెసేజ్ మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. "అస్సలామాలేకుం. కరాచీ కంట్రోల్ఎయిర్ ఇండియా సహాయక విమానాలకు స్వాగతం పలుకుతోంది"అని వినిపించింది. ఆ తరువాత ఫ్రాంక్ ఫర్ట్ కు రిలీఫ్ విమానాలను తీసుకెళుతున్నామని కన్ఫార్మ్ చేయమని అడిగారు" అని విమానాన్ని నడిపిన పైలెట్ తెలిపారు.
తాము కన్ఫార్మ్ చేసిన తరవాత, "మహమ్మారి విస్తరించిన వేళ, మీరు విమానాలను నడిపిస్తుండటాన్ని చూసి మేము గర్వపడుతున్నాము. గుడ్ లక్" అన్న మెసేజ్ వచ్చింది. దానికి మేము "థ్యాంక్యూ వెరీమచ్" అని సమాధానం ఇచ్చినట్టు పైలెట్ తెలిపారు. పాకిస్థాన్ ఎయిర్ బేస్ ను వాడుకున్న కారణంతో 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
భారత విమానాలకు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ సాయం ఆపైనా కొనసాగిందని, పాకిస్థాన్ ను దాటిన తరువాత ఇరాన్ ఎయిర్ స్పేస్ లోకి భారత విమానాలు ప్రవేశించిన వేళ, ఆ సమయంలోనూ ఏటీసీతో సంబంధం దొరకలేదని, అప్పుడు పాక్ ఏటీసీ మరోసారి సహకరించిందని ఎయిర్ ఇండియా పేర్కొంది. పాక్ నుంచి ఇరాన్ అధికారులకు సమాచారం వెళ్లిందని, వాస్తవ పరిస్థితుల్లో ఇరాన్ గగనతలంపై ఎక్కువ సేపు విమానం ప్రయాణించాల్సి వుంటుందని, కానీ, ఎయిర్ ఇండియా విమానాలకు షార్ట్ రూట్ ను ఇచ్చారని తెలిపారు.
ఆ తరువాత టర్కీ, జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నుంచి కూడా సహకారం, ప్రశంసలు అందాయని, దీంతో షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9.15 గంటలకు ఫ్రాంక్ ఫర్ట్ లో ల్యాండ్ కావాల్సిన విమానం, ఉదయం గం.8.35కే ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, కెనడా దేశాల్లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యక్తులను స్వదేశానికి చేర్చేందుకు ఎయిర్ ఇండియా 18 విమానాలను నడిపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. షాంగై నుంచి క్రిటికల్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను దిగుమతి చేసుకునేందుకు కూడా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది.