TDP: వైసీపీ నేతల అధికార దుర్వినియోగంపై టీడీపీ ఫైర్ : గవర్నర్ కు ఫిర్యాదు!
- కరోనా సాయాన్ని రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటున్నారు
- నిబంధనలు తుంగలో తొక్కి ఓట్ల వేట
- లేఖలో ఆరోపించిన టీడీపీ నాయకులు యనమల, నిమ్మల, అచ్చెన్న
కరోనా కష్టకాలంలోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల వేటలో నిమగ్నమై ఉందని, ఇందుకోసం నిరు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని, రేషన్ దుకాణాల ద్వారా చేస్తున్న నిత్యావసరాల పంపిణీని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఆ పార్టీ నేతలుమండలిలో టీడీపీ విపక్ష నేత యనమల రామకృష్ణుడు, టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. లాక్‌డౌన్ సందర్భంగా భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా వైసీపీ నేతలు గుంపుగా వెళ్లి సాయాన్ని పంపిణీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ సాయాన్ని పంపిణీ చేస్తూ తమ ఓట్ల వేటకు ఉపయోగించుకుంటున్నారని, తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.