Deepam: నేటి రాత్రి దీపం జ్యోతి... భారత సైన్యం ప్రజలకు ఇస్తున్న సలహా ఇది!
- చేతులను శానిటైజ్ చేసుకున్న వెంటనే దీపాలు వెలిగించ వద్దు
- కర్ర గడపలపై కొవ్వొత్తులు వెలిగించరాదు
- ఫ్యాన్లు, ఏసీ మెషీన్లు ఆన్ చేసే ఉంచాలని సూచన
కరోనాపై పోరాడే విషయంలో జాతి యావత్తూ ఏకతాటిపై నిలిచిందనడానికి సంకేతంగా, ఆదివారం సరిగ్గా రాత్రి 9 గంటలకు, లైట్లన్నీ ఆర్పివేసి, 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించాలని, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను వెలిగించడం ద్వారా సంఘీభావాన్ని చాటుదామని ప్రధాని నరేంద్ర మోదీ, రెండు రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది. ప్రజలు ఎవరూ శానిటైజర్లు, ఆల్కహాల్ ఆధారిత ద్రవాలతో చేతులు కడుక్కున్న వెంటనే దీపాలను వెలిగించవద్దని ఇండియన్ ఆర్మీ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
ఆల్కహాల్ కు వెంటనే మండే గుణం ఉంటుంది కాబట్టి, చేతులను శానిటైజ్ చేసుకున్న సాధ్యమైనంత ఎక్కువ సేపటి తరువాత మాత్రమే దీపాలను వెలిగించాలని సూచించింది. ఇక కర్రతో తయారు చేసిన గడపలపై కొవ్వొత్తుల బదులుగా, ప్రమిద దీపాలను వెలిగించాలని సూచించింది. ఇక ఇదే సమయంలో లైట్లన్నీ ఒకేసారి ఆర్పివేస్తే, విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం కూడా ఉన్నందున, ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్ లు, ఏసీ మెషీన్లు తదితరాలను ఆర్పరాదని కోరింది.