Imran Khan: ఓసారి న్యూయార్క్ లో పరిస్థితి ఎలావుందో చూడండి: ప్రజలను హెచ్చరించిన పాక్ ప్రధాని
- కరోనాకు ఎవరూ అతీతులు కారన్న ఇమ్రాన్ ఖాన్
- దీన్నో సవాల్ గా స్వీకరించాలని ఉద్బోధ
- జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం తప్పదని వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి పాకిస్థానీలేమీ అతీతులు కారని, జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ఓసారి న్యూయార్క్ లో పరిస్థితి ఎలావుందో పాకిస్థానీలు గమనించాలని ఇమ్రాన్ ఖాన్ హితవు పలికారు.
"కరోనా వైరస్ మనల్నేమీ చేయదులే అనుకుంటే అది వాళ్ల భ్రమ. న్యూయార్క్ లో ఎంతో ధనికులైన ప్రజలు నివసిస్తుంటారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో చూడండి. ఒక్కసారి ఈ వైరస్ తిష్టవేసిందంటే ఏం జరుగుతుందో మనం ఊహించలేం" అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీన్నో సవాల్ గా స్వీకరిస్తే పాకిస్థాన్ ఒక భిన్నమైన దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు పాకిస్థాన్ లో 2,880 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృత్యువాత పడ్డారు.