Chiranjeevi: కరోనా సమస్య తొలగితే 'సీసీసీ' ఉండదు... 'మనకోసం' పేరుతో కంటిన్యూ చేస్తాం: చిరంజీవి
- కరోనా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ మూసివేత
- సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ ఆవిర్భావం
- భవిష్యత్తులో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. సినీ కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశామని, అయితే ఇప్పటికప్పుడు సీసీసీ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే వీల్లేకపోవడంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఖాతా సాయంతో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు.
హీరోయిన్లలో కొందరికి సీసీసీ గురించి సమాచారం లేకపోవడంతో వారు విరాళాల విషయంలో స్పందించలేకపోతున్నారని, అలాంటివారిని తాము వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నామని చిరంజీవి చెప్పారు. కరోనా వైరస్ సమస్య తొలగిపోతే సీసీసీ ఉండదని, దానిస్థానంలో మనకోసం అనే పేరుతో సంస్థను కొనసాగిస్తామని వెల్లడించారు. మనకోసం పేరిట ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో సినిమా రంగానికి చెందినవారికి ఎలాంటి అవసరం వచ్చినా ఈ సంస్థ ద్వారా ఆదుకుంటామని స్పష్టం చేశారు.