Puvvada Ajay: ‘కరోనా’ను ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం: మంత్రి పువ్వాడ
- ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు
- ప్రస్తుతం 200 పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయి
- మరో 1000 కిట్స్ తెప్పించనున్నాం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీహెచ్ఎంవో మాలతి తో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్స్ ను పంపిణీ చేశారు. ‘కరోనా’ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుని, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ ను తరిమేయ వచ్చని సూచించారు. ప్రస్తుతం 200 పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర వైద్య శాఖ అధికారులతో మాట్లాడి అదనంగా మరో 1000 కిట్స్ తెప్పించనున్నట్టు చెప్పారు. బెడ్స్, ఐసీయూ, సిబ్బంది తదితర సదుపాయాలు అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.