Narendra Modi: వైఎస్ జగన్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ!
- కరోనా నియంత్రణ చర్యలపై వివరించిన జగన్
- పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపైనా వివరణ
- రాష్ట్రానికి నిధులిచ్చి ఆదుకోవాలని జగన్ వినతి
ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి, కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందన్న విషయంపైనే ఇరువురి మధ్యా ప్రధానంగా చర్చ సాగింది. కరోనా కట్టడికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకున్నామని, వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టామని, శానిటేషన్ పనులు సాగుతున్నాయని ఈ సందర్భంగా జగన్, మోదీకి వివరించారు.
తమ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపిన జగన్, కేంద్రం నుంచి రావాల్సివున్న నిధులపై ఇటీవలే లేఖ రాశానని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ. 2,200 కోట్లు, 14వ ఫైనాన్షియల్ కమిషన్ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు అందాల్సిన రూ. 1,100 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన రూ. 1,050 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ. 900 కోట్లను వెంటనే విడుదల చేయాలని జగన్ కోరగా, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.