Tabligi Jamat: పారిపోదామని చూసిన విదేశీ తబ్లిగీలపై పోలీసుల యాక్షన్ మొదలు!
- గత నెలలో న్యూఢిల్లీలో మత ప్రార్థనలకు పలువురు విదేశీయులు
- వారి కారణంగానే మూడింట ఒకవంతు కరోనా కేసులు
- న్యూఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల నుంచి పారిపోతుంటే నిలువరించిన పోలీసులు
ఇండియాలో కరోనా వైరస్ ఇంతలా వ్యాపించడానికి కారణమైన ఒకే ఒక్క, అతిపెద్ద సోర్స్ గా నిలిచిన న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, మర్కజ్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి వచ్చి, ఆపై చెప్పాపెట్టకుండా దేశం విడిచి వెళ్లాలని భావించిన అందరిపైనా పోలీసుల చర్యలు మొదలయ్యాయి. అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ తబ్లిగీ కార్యకర్తలపై నిఘా పెట్టారు.
నిన్న ఆదివారం నాడు తబ్లిగీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ టీమ్, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ దస్త్రాల్లో ఇండియాకు విదేశాల నుంచి వచ్చిన తబ్లిగీ కార్యకర్తల వివరాలన్నీ ఉన్నట్టు సమాచారం. "ఇక్కడ జరిగిన మత ప్రార్థనలు, వాటికి హాజరైన వారు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు దాచి పెట్టడం తదితరాలపై ఇప్పటికే కేసు విచారణ ప్రారంభించాం" అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తబ్లిగీ కార్యకర్తలపై (ఎఫ్ఐఆర్ నంబర్ 63), వారి నాయకులపై పలు నేరాల కింద కేసులను రిజిస్టర్ చేశామని వెల్లడించారు.
ఇక ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చేరుకున్న తబ్లిగీ కార్యకర్తలపైనా కేసులను నమోదు చేయాలంటూ హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నుంచి ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు రాష్ట్రాల్లో పట్టుబడిన వారి వివరాలను కేంద్రం తెప్పించుకుంటోంది. దీంతో తమపై క్రిమినల్ కేసులను పెడతారన్న ఆందోళనతో ఉన్న పలువురు మలేసియా, ఇండోనేషియా తబ్లిగీలు, ఇండియా నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక విమానాలు ఎక్కి పారిపోవాలని ప్రయత్నించి విఫలం అయ్యారు.
ఢిల్లీ, చెన్నై ఎయిర్ పోర్టుల్లో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 8 మంది మలేషియన్లు కౌలాలంపూర్ కు వెళుతున్న విమానాన్ని ఎక్కగా, వారిని దించివేశారు. విమానం టేకాఫ్ కు నిమిషాల ముందు ఇది జరిగింది. ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల కారణంగానే వచ్చాయన్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నమోదైన 503 కేసుల్లో 320 కేసులు తబ్లిగీ జమాత్ తో లింక్ ఉన్నవే కావడం గమనార్హం.
ఈ ప్రార్థనల తరువాత పలువురు విదేశీయులు దాదాపు 17 రాష్ట్రాలకు వెళ్లగా, అన్ని రాష్ట్రాల్లోనూ వీరి కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 28న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్, మర్కజ్ ప్రాంతంపై దాడులు చేసి, అక్కడే ఉన్న ఎంతో మంది తబ్లిగీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని క్వారంటైన్ సెంటర్లకు తరలించింది. వారిలో కరోనా లక్షణాలు కనిపించిన వారిని ఐసొలేషన్ సెంటర్లకు తరలించారు. వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ రాగా, మరో 200 మందిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. తబ్లిగీలు, వారితో సంబంధమున్న 21,200 మందిని ఇప్పటివరకూ క్వారంటైన్ లో ఉంచామని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.