mumbai: కరోనా లేదు.. గిరోనా లేదు.. అదంతా ప్రభుత్వ కుట్రంటూ ఫేస్‌బుక్ పోస్ట్.. నిందితుడి అరెస్ట్
- నిజానికి కరోనా ఉనికిలో లేదు
- ప్రభుత్వం వైరస్ పేరుతో కుట్ర చేస్తోంది
- ఎవరొచ్చి అడిగినా వివరాలు ఇవ్వొద్దు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిజంగా లేదని, అదంతా ప్రభుత్వ కుట్ర అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తి(36)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన సదరు వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ అప్‌లోడ్ చేస్తూ.. కరోనా వైరస్ ప్రభుత్వ కుట్ర అని, అధికారులు అడిగినా ఎవరూ తమ వివరాలు బయటపెట్టొద్దని అందులో పేర్కొన్నాడు.
నిజానికి వైరస్ అనేది ఉనికిలో లేదని, ప్రభుత్వం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని చేసిన కుట్రే ఈ వైరస్ తప్ప మరోటి కాదని పేర్కొన్నాడు. అధికారులు ఎవరైనా వచ్చి వివరాలు అడిగితే ఇవ్వొద్దని కోరాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో అధికారుల దృష్టికి చేరింది. దీంతో, అతడిని కుర్లా ఈస్ట్‌లోని ఖురేషీ నగర్‌కు చెందిన షమీమ్ ఇఫ్తెఖార్ ఖాన్‌గా గుర్తించారు. నిన్న తెల్లవారుజామున చునాబట్టి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై 188, 505 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.