Lockdown: లాక్డౌన్లో భారీగా పెరిగిన గృహ హింస
- అన్ని దేశాల్లో దారుణంగా ఉందని గుర్తించిన యునైటెడ్ నేషన్స్
- సొంత ఇళ్లలోనే మహిళలకు రక్షణ లేదని ఆవేదన
- నివారణకు ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని సూచన
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు. మరికొన్ని దేశాల్లో ప్రజలు బయటికి రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఓ వైపు ప్రాణాంతక మహమ్మారిపై ప్రభుత్వాలు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మహిళలపై గృహహింస పెరిగింది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. లాక్డౌన్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస దారుణంగా పెరిగిందని, వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది.
‘హింస అనేది కేవలం యుద్ధభూమికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళలు, బాలికలకు ఎంతో సురక్షితమైనదిగా భావించే సొంత ఇళ్లలోనే వారికి ఎక్కువ ముప్పు ఉంది. గత కొన్ని వారాలుగా ప్రజల్లో ఆర్థిక, సామాజిక ఒత్తిడితో పాటు భయం పెరిగింది. అదే సమయంలో గృహహింసలో భయంకరమైన పెరుగుదలను మేం గుర్తించాం. కొవిడ్-19 కట్టడికి తీసుకునే చర్యల్లో భాగంగా ఆయా దేశాల ప్రభుత్వాలు ముందుగా మహిళలపై హింసను అరికట్టడం చాలా ముఖ్యం’ అని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పలు భాషల్లో వీడియో సందేశం ఇచ్చారు.
భారత్‌లో లాక్డౌన్ విధించిన తొలివారంలో సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో మహిళలపై గృహ హింస పెరిగినట్టు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ఫ్రాన్స్‌లో మూడు రెట్లు పెరిగినట్టు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఫార్మసీలు, కిరాణా షాపుల్లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని గుటెరెస్ చెప్పారు. అలాగే, మహిళలు సాయం కోరేందుకు తగిన సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనాను ఓడించేందుకు కృషి చేస్తున్న ఈ సమయంలో యుద్ధభూమి నుంచి ప్రజల ఇళ్ల వరకు ప్రతి చోట హింసను నిరోధించి శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు.