Cricketer: మళ్లీ చెస్ ప్లేయర్ అవతారం ఎత్తిన స్పిన్నర్ చాహల్

Yuzvendra Chahal plays online chess tournament

  • పలువురు గ్రాండ్‌ మాస్టర్లతో ఆన్‌లైన్‌ టోర్నీ ఆడిన యువ క్రికెటర్
  • లాక్‌డౌన్‌ విరామంలో  సరదాగా ఎత్తులు వేసిన యజ్వేంద్ర
  • క్రికెట్ కోసం చెస్‌ ను వదులుకున్నానని వెల్లడి

లాక్‌ డౌన్ కారణంగా  ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు ఆగిపోవడంతో ఆటగాళ్లు కూడా చాలా రోజుల నుంచి తమ ఇంట్లోనే సేద తీరుతున్నారు. భార్యా పిల్లలు ఉన్నవారు వారితోనే ఈ విరామాన్ని ఆస్వాదిస్తుంటే.. బ్యాచిలర్ క్రీడాకారులు మాత్రం తమకు తోచిన పనుల్లో నిమగ్నమయ్యారు. టిక్ టాక్‌ వీడియోలు, సోషల్ మీడియాలో సహచరులతో సరదా సంభాషణలు చేసి ఆకట్టుకున్న టీమిండియా యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు తనకు ఇష్టమైన మరో ఆటపైకి మనసు మళ్లించాడు.

చిన్నప్పుడు చెస్‌ను ఎంతో ఇష్టంగా ఆడి తర్వాత క్రికెటర్ అవతారం ఎత్తిన చాహల్ ఈ విరామంలో మళ్లీ ‘చదరంగం’కి దిగాడు. ఓ ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో పాల్గొని ఎత్తులు వేశాడు. భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన రెండో పిన్న వయస్కుడైన ఆర్. ప్రజ్ఞానందతో పాటు ఇతర గ్రాండ్ మాస్టర్లు బి. అదిబన్, నిహాల్ సరిన్, కార్తికేయన్ మురళి తదితరులతో పోటీ పడ్డాడు.  టోర్నీ ఆడేముందు గ్రాండ్ మాస్టర్ అభిజిత్ గుప్తా, ఇంటర్నేషనల్ మాస్టర్ రాకేశ్ కులకర్ణితో అతను మాట్లాడాడు. జాతీయ అండర్-12 మాజీ చాంపియన్ అయిన చాహల్ ఈ సందర్భంగా చెస్, క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘ఓపిగ్గా  ఉండడం ఎలానో చెస్  నాకు నేర్పించింది. క్రికెట్లో మనం బాగా బౌలింగ్ చేసినా కొన్ని సార్లు వికెట్లు రావు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లో కొన్నిసార్లు ఎంత బాగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేం. అలాంటప్పుడు తర్వాతి రోజు పుంజుకోవాలంటే ఓపిగ్గా ఉండడం చాలా ముఖ్యం. ఈ విషయంలో చెస్ నాకు చాలా నేర్పింది. బ్యాట్స్‌ మెన్‌ను ఔట్ చేసేంత వరకూ ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నా’ అని చాహల్ చెప్పుకొచ్చాడు.

చెస్, క్రికెట్‌లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన సమయంలో ఈ విషయంపై తన తండ్రితో మాట్లాడానని చెప్పాడు. తనకు క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి ఉండడంతో దానిపైనే దృష్టి పెట్టానని తెలిపాడు.

  • Loading...

More Telugu News