KCR: ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుకుంటున్నా: సీఎం కేసీఆర్
- లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరుతానని కేసీఆర్ వెల్లడి
- ఆర్థికంగా నష్టపోతే పూడ్చుకోవచ్చని వెల్లడి
- ప్రాణం పోతే తీసుకురాలేమని వ్యాఖ్యలు
కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే సరైన ఆయుధం అని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగించాలని ప్రధానిని కోరుతున్నానని అన్నారు. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ పూడ్చుకోవచ్చని, ప్రాణంపోతే తీసుకురాలేమని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను ఎంత కఠినంగా అమలు చేస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. భారత్ లో జూన్ 3 వరకు లాక్ డౌన్ పాటించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా చెప్పిందని వివరించారు. లాక్ డౌన్ ను సడలించిన తర్వాత జనం గుంపులుగా వస్తే ఎవరు జవాబుదారీ? అని ప్రశ్నించారు. ఏదేమైనా, లాక్ డౌన్ సడలింపు అంటే అంత తేలిక కాదని అన్నారు.