India: కరోనాతో సతమతమవుతున్న రాష్ట్రాలు... అదనంగా నిధులు కేటాయించిన కేంద్రం
- ఇప్పటికే రూ.1100 కోట్లు కేటాయించిన కేంద్రం
- తాజాగా మరో రూ.3 వేల కోట్ల కేటాయింపు
- ఎంపీల జీతాల్లో ఏడాది వరకు కోత
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు రూ.1100 కోట్లు అందించిన కేంద్రం తాజాగా మరో రూ.3 వేల కోట్లు కేటాయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ నిధులు అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.
కాగా, ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని, మంత్రులు, పార్లమెంటు సభ్యుల వేతనాల్లో ఏడాది వరకు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్వచ్చందంగా తమ వేతనాల్లో కోత విధించుకున్నారు. రెండేళ్లపాటు ఎంపీ నిధులన్నింటిపైనా సస్పెన్షన్ విధించి, ఆ నిధులను కరోనాపై పోరు కోసం ఉపయోగించనున్నారు.