Tablighi Jamaat: మతపెద్దల సూచనలను పెడచెవిన పెట్టి.. వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిన తబ్లిగి చీఫ్
- ముందే మేల్కొన్న ముస్లిం మేధావులు
- సదస్సును వాయిదా వేయాలంటూ సూచన
- మొండిపట్టుదలకు పోయిన మౌలానా ముహమ్మద్
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కారణమైన తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ కంధిలావి.. పలువురు సీనియర్ మతపెద్దలు చేసిన సూచనను పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సు నిర్వహించడం సరికాదని, కొన్నాళ్లపాటు వాయిదా వేయాలంటూ మతపెద్దలు, ముస్లిం మేధావులు, తన సొంత సహచరులు చేసిన సూచనను కూడా ఆయన పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ముందుగానే మేల్కొన్న ముస్లిం మేధావులు ఈ సమావేశాన్ని నిర్వహించొద్దని ముందుగానే ఆయనకు సూచించారు.
అయితే మౌలానా మొండిపట్టుదల ముందు వారి సూచనలు ఏమాత్రం పనికి రాకుండా పోయాయి. ఫలితంగా వేలాదిమంది ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫాలోవర్లు మాట్లాడుతూ.. తనను గుడ్డిగా నమ్మడాన్ని ఆయన తమకు నేర్పించారని, ఇప్పుడదే తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ సదస్సుకు హాజరైన వారిలో చాలామందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. వారంతా ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు. కాగా, తబ్లిగి చీఫ్ సాద్, ఆయన సలహాదారులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.