Vizag: ఒకే ఒక్క మాస్కు ఇచ్చారు.. దాన్ని 15 రోజుల పాటు ఉపయోగించుకోవాలట: నర్సీపట్నం వైద్యుడి ఆవేదన
- నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తోన్న వైద్యుడు
- తమకు మాస్కులు అందడం లేదని ఆగ్రహం
- దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాలని వ్యాఖ్య
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందికి సరైన సదుపాయాల లేమి ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన పీపీఈ కిట్లు, మాస్కులు వంటి సదుపాయాలు లేవని మీడియాకు తెలుపుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా, విశాఖ జిల్లాకు చెందిన వైద్యుడు సుధాకర్ రావ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో తాను అనస్థటిస్ట్ గా పనిచేస్తున్నాననీ, తమకు మాస్కులు అందడం లేదని చెప్పారు.
'కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో నాకు ఒకే ఒక్క మాస్కు ఇచ్చారు.. దాన్ని 15 రోజుల పాటు ఉపయోగించుకోవాలని చెప్పారు. వారు అసలు ఏమనుకుంటున్నారు? కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడకు రావని అనుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాలి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క మాస్కును 15 రోజులు వాడాలంటూ సిబ్బంది వచ్చి తమకు చెబుతుండగా తీసిన వీడియోను ఆయన చూపించారు. వైద్య సిబ్బందికి కనీసం సదుపాయాలు కల్పించకపోతే తాము చచ్చిపోతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతి వైద్యుడికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడ మాత్రం పోలీసులకు కూడా వైద్యులంటే లోకువైపోయారని ఆయన చెప్పారు. తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాస్కులు ఇవ్వకుండా తమను ప్రమాదంలోకి నెట్టేస్తున్నరని చెప్పారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.