Corona Virus: హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు తబ్లిగీ కార్యకర్త మాస్టర్ ప్లాన్!
- నేపాల్ నుంచి ప్రార్థనలకు వచ్చిన వ్యక్తి
- యూపీలోని ఆసుపత్రిలో చికిత్స
- కిటికీ పగులగొట్టి పరార్
- గాలిస్తున్న పోలీసులు
కరోనా వైరస్ లక్షణాలతో యూపీ రాజధాని లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ తబ్లిగీ జమాత్ కార్యకర్త (60) మాస్టర్ ప్లాన్ వేసి, పారిపోవడంతో అధికారులు, పోలీసులు అతని కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇక్కడి భాగాపేట్ లో ఉన్న ఆసుపత్రికి శుక్రవారం నాడు అతన్ని తీసుకుని వచ్చారు. నేపాల్ నుంచి ఢిల్లీ మత కార్యక్రమానికి వచ్చిన 17 మందిలో ఇతను కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.
ఇక ఇతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచగా, తొలుత కిటికీని పగలగొట్టి, ఆపై తాను ధరించిన దుస్తులనే తాడుగా పేని, ఆపై కిటికీ నుంచి కిందకు దిగి పారిపోయాడు. ఇతని కోసం సమీప గ్రామాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కాగా, ఆసుపత్రిలో ఉన్న నాలుగు రోజులూ ఇతని ప్రవర్తనలో ఎటువంటి అనుమానమూ రాలేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం.
అతన్నుంచి ఎవరికీ సమస్య రాలేదని వెల్లడించిన ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే టాండన్, అతను ఇలా చేసి, పారిపోయాడంటే తనకు ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాలో నమోదైన కరోనా కేసుల్లో 30 శాతం తబ్లిగీ జమాత్ తో సంబంధమున్నవేనన్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ప్రార్థనలకు వచ్చిన ఎంతో మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, కరోనా వ్యాప్తికి కారణమయ్యారు.