Corona Virus: కరోనా భయం నేపథ్యంలో... అమ్మాయిపై ఉమ్మివేసి పారిపోయిన యువకుడు!
- ముంబైలో ఘటన
- మండిపడ్డ జాతీయ మహిళా కమిషన్
- చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
కరోనా విజృంభణ నేపథ్యంలో కొందరు పోకిరీలు అమ్మాయిలపై ఉమ్మి వేస్తూ వికృతానందం పొందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా సోకిన వారు ఉమ్మివేస్తే అది తమకూ సోకుతుందని ప్రజలు భయపడుతున్న వేళ ఇటువంటి చేష్టలకు పాల్పడుతున్నారు.
ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో మణిపూర్ మహిళపై ఉమ్మేసిన ఘటన మరవక ముందే మహారాష్ట్ర రాజధాని ముంబైలో మణిపూర్‌కు చెందిన ఓ అమ్మాయిపై ఓ యువకుడు ఉమ్మేసి పారిపోవడం కలకలం రేపుతోంది.
వోకాలా పోలీసు స్టేషన్ పరిధిలోని కలినా మిలిటరీ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. తనకు కరోనా సోకుతుందేమోనని ఆమె భయపడుతోంది. నిత్యావసర వస్తువులు కొనేందుకు తన స్నేహితురాలితో కలిసి ఆమె బయటకు వచ్చిన సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి మాస్క్ తీసి ఉమ్మేశాడు.
దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిపై ఉమ్మి వేసిన ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇది జాతి వివక్షగానూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య భారత మహిళలపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. కలీనా మార్కెట్ ఏరియాలో అమ్మాయిపై ఉమ్మి వేసిన మరో ఘటన చోటు చేసుకుందని జాతీయ మహిళా కమిషన్ తమ ట్విట్టర్ ఖాతాలోనూ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ఆ యువకుడు గుట్కా నమిలి ఆ యువతి షర్టుపై ఉమ్మి వేసినట్లు తెలుస్తోంది.