Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఆక్సిజన్ సపోర్ట్... వెంటిలేటర్ పై లేడన్న మంత్రి!

UK Prime Minister Boris Johnson on oxygen support

  • తనకు కరోనా సోకినట్టు మార్చి 27న వెల్లడించిన బ్రిటన్ ప్రధాని
  • కరోనా లక్షణాలు పెరగడంతో ఆసుపత్రిలో చేరిక
  • ఐసీయూలో చికిత్స

కరోనా వైరస్ భూతం ప్రముఖులను సైతం వెంటాడుతోంది. కరోనా సోకడంతో కొన్నిరోజులుగా స్వీయనిర్బంధంలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో నిన్న లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు.

దీనిపై బ్రిటన్ క్యాబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ మాట్లాడుతూ, ప్రధాని బోరిస్ జాన్సన్ ఆక్సిజన్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని,  అయితే ఆయన వెంటిలేటర్ పై లేరని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఓ వెంటిలేటర్ ను సిద్ధంగా ఉంచారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు గోవ్ పేర్కొన్నారు.

తనకు కరోనా సోకినట్టు బోరిస్ జాన్సన్ మార్చి 27న ప్రకటించారు. అప్పటినుంచి తన నివాసం నుంచే పాలనా వ్యవహారాలు నిర్వర్తించారు. అయితే శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

కాగా, ప్రధాని ఆరోగ్యం దృష్ట్యా బ్రిటన్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం బాగా క్షీణించినట్టుగా ఉందని లండన్ యూనివర్సిటీ కాలేజి మెడికల్ ఇమేజింగ్ ప్రొఫెసర్ డెరెక్ హిల్ తెలిపారు. అయితే, వార్విక్ మెడికల్ స్కూల్ కు చెందిన గౌరవ అధ్యాపకుడు జేమ్స్ గిల్ మాట్లాడుతూ, కరోనా సోకిన వారికి ఐసీయూలో ట్రీట్ మెంట్ ఇవ్వడం సాధారణమేనని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News