Plasma: కరోనా చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ప్లాస్మా థెరపీ!

Korean doctors says plasma therapy an alternative treatment for corona patients

  • ప్లాస్మా థెరపీతో ఇద్దరు వృద్ధులకు కరోనా నయం
  • ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ప్లాస్మా థెరపీ
  • అయితే మరిన్ని ప్రయోగాలు అవసరమంటున్న కొరియా డాక్టర్లు

చైనాలోని వుహాన్ జన్మస్థానంగా చెలరేగిన కరోనా రక్కసి ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. వ్యాక్సిన్ లేకపోవడంతో లక్షల మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. పైగా ఈ మహమ్మారి సోకితే నిర్దిష్ట వైద్యవిధానం అంటూ కూడా లేకపోవడంతో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు, వృద్ధులు పెద్ద సంఖ్యలో బలవుతున్నారు.

అయితే, దక్షిణ కొరియాలో కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ఉపయోగించి సత్ఫలితాలు రాబట్టారు. కరోనా లక్షణమైన తీవ్రస్థాయి న్యూమోనియాతో బాధపడుతున్న ఇద్దరు వృద్ధులకు ప్లాస్మా థెరపీ చేయగా, వారిద్దరూ కోలుకున్నారు. ఈ పరిణామం కొరియా పరిశోధకుల్లో ఉత్సాహం కలిగిస్తోంది.

ఆ వృద్ధులకు మొదట్లో మలేరియా, న్యూమోనియా, హెచ్ఐవీ మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. వారిలో ఓ వృద్ధురాలికి ఆక్సిజన్ థెరపీ కూడా చేశారు. అదీ విఫలమైంది. దాంతో మరో ప్రయత్నంగా ప్లాస్మా థెరపీ నిర్వహించారు. ప్లాస్మా అంటే రక్తంలో కలిసివుండే ఓ ద్రవ పదార్థం. దీన్ని కరోనా బారినపడి కోలుకున్నవారి రక్తం నుంచి సేకరిస్తారు. వారి రక్తంలో కరోనా యాంటీబాడీస్ తయారై ఉంటాయి కాబట్టి, వాటిని సేకరించి కరోనా నయం కాని రోగుల రక్తంలో ప్రవేశపెడతారు. ఆ యాంటీబాడీస్ సమర్థంగా పోరాడి కరోనా క్రిములను నాశనం చేస్తాయి.

ఆ వృద్ధులు ఇద్దరికీ ఈ తరహా చికిత్స చేయగా, కరోనా పూర్తిగా నయమైనట్టు గుర్తించారు. విషమంగా ఉన్న పేషెంట్లకు ప్లాస్మా చికిత్స గొప్ప ప్రత్యామ్నాయం అని సియోల్ లోని సెవెరన్స్ ఆసుపత్రి డాక్టర్ చోయి జున్ యోంగ్ తెలిపారు. అయితే మరిన్ని ప్రయోగాల అనంతరమే ప్లాస్మా చికిత్స ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్నది తేలుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News