Telangana: ఆయా ఉద్యోగులకు 'చీఫ్ మినిస్టర్ స్పెషల్ ఇన్సెంటివ్' జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- తెలంగాణలో ‘కరోనా’ కట్టడికి శ్రమిస్తున్న సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు
- సీఎం కేసీఆర్ నిన్నటి ప్రకటన మేరకు ఈరోజు జీవో జారీ
- మార్చి నెలలో విధులకు హాజరైన ఉద్యోగులకు మాత్రమే వర్తింపు
తెలంగాణలో ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి నిరంతరం పాటుపడుతున్న వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది సహా పారిశుద్ధ్య సిబ్బందికి చీఫ్ మినిస్టర్ వన్ టైం స్పెషల్ ఇన్సెంటివ్ కింద నగదు ప్రోత్సాహకాలు ఇస్తానని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రామ పంచాయతీలలోని మల్టీ పర్పస్ వర్కర్లకు, వాటర్ సప్లై లైన్ మెన్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీ కు చెందిన మురుగునీటి కార్మికులకు ఈ ఇన్సెంటివ్ లు అందనున్నాయి. మార్చి నెలలో తమ విధులకు హాజరైన ఉద్యోగులకు మాత్రమే ఈ ఇన్సెంటివ్ లు ఇవ్వడం జరుగుతుందని, ఆ నెలలో సెలవులో ఉన్న వారికి, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన వారికి, సస్పెన్షన్ లో ఉన్న వారికి ఇవ్వడం జరగదని ఈ జీవోలో స్పష్టం చేశారు. ఆ వివరాలు..
* వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, వారి గ్రాస్ శాలరీల్లో 10 శాతం
* జీహెచ్ఎంసీకి చెందిన రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగులు/ సిబ్బందికి రూ.7500 చొప్పున
* హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీకు చెందిన రెగ్యులర్ వాటర్ సప్తై లైన్ మెన్, మురుగు కాల్వల కార్మికులకు రూ.7,500 చొప్పున
* జీహెచ్ఎంసీ కాకుండా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని రెగ్యులర్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు/ సిబ్బందికి రూ.5,000 చొప్పున
* గ్రామ పంచాయతీలలోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ కు చెందిన పారిశుద్ధ్య-మల్టీ పర్పస్ కార్మికులకు రూ.5000 చొప్పున అందనున్నాయి.