Mumbai: ఇండియాలో 20 శాతం కరోనా కేసులు ఆ రాష్ట్రంలోనివే!
- మహారాష్ట్రలో మరింతగా విస్తరించిన కరోనా
- మంగళవారం ఒక్కరోజే 150 కేసులు
- 116 కేసులు ముంబై మహానగరంలోనే
భారత ఆర్థిక రాజధానిగా పేరున్న మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ, 1000 దాటేశాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 150 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,018కి పెరిగింది. అంటే, దేశంలో నమోదైన 5,351 కేసుల్లో దాదాపు 20 శాతం మహారాష్ట్రలోనివే. ఇక ఒక్క ముంబై మహానగరంలోనే 590 మందికి ఇప్పటివరకూ కరోనా సోకింది. ఒక్క మంగళవారం నాడే 116 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆపై పూణెలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం మహారాష్ట్రలో 875 మంది చికిత్స పొందుతూ ఉండగా, 79 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 64 మంది మరణించారు. మహారాష్ట్ర తరువాత తమిళనాడు (690), ఢిల్లీ (576), తెలంగాణ (404), రాజస్థాన్ (343), కేరళ (336), ఉత్తరప్రదేశ్ (332), ఆంధ్రప్రదేశ్ (314)లలో కేసుల సంఖ్య 300కు పైగా నమోదైంది.