Maharashtra: నాగపూర్ లో పోలీసులపై పూల వర్షం... వీడియో ఇదిగో!
- లాక్ డౌన్ సమయంలో శ్రమిస్తున్న పోలీసులు
- గట్టిఖాదన్ ప్రాంతంలో మార్చ్ ఫాస్ట్
- చప్పట్లు కొడుతూ, పూలు చల్లిన ప్రజలు
లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయడంలో పోలీసులదే ప్రధాన పాత్ర అని చెప్పడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. తమ విధి నిర్వహణలో భాగంగా, వైరస్ సోకుతుందన్న భయాలను పక్కనబెట్టి, ఇంటికి దూరమై, అనునిత్యమూ శ్రమిస్తున్న పోలీసులపై నాగపూర్ లోని గట్టిఖాదన్ ప్రాంత వాసులు పూల వర్షం కురిపించారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, పోలీసులు మార్చ్ ఫాస్ట్ చేస్తున్న వేళ ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నాగపూర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా షేర్ చేస్తూ, ప్రజలకు, తమ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపింది. జోన్-2 డీసీపీ ఎస్ వనిత నేతృత్వంలో రూట్ మార్చ్ నిర్వహిస్తున్న వేళ ఈ ఘటన జరిగినట్టు పేర్కొంది.
ఈ వీడియోలో పోలీసు వాహనం నుంచి ప్రజలకు సూచనలను మైక్ లో వివరిస్తూ ఉండగా, దాని వెనుకే, పోలీసులు, ప్రత్యేక సిబ్బంది నడుస్తూ వెళ్లారు. దాదాపు 60 మంది పోలీసులు అలా వెళుతూ ఉంటే, చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు చప్పట్లు కొడుతూ, వారిపై పూలు చల్లారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.