Lockdown: ఆన్‌లైన్ క్లాసెస్ కు వరంలా మారిన లాక్‌డౌన్.. పెరిగిన ఆదాయ మార్గాలు
- ఇ-లెర్నింగ్‌కు డిమాండ్ పెరగడమే కారణం
- మూతపడిన పలు కళాశాలలు, విద్యా సంస్థలు
- దీంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు ప్రాధాన్యం
లాక్‌డౌన్ పలు రంగాలను కుదేలు చేసినా, కొన్ని ఆన్‌లైన్ క్లాసుల సంస్థలకు మాత్రం కాసులు కురిపించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కరోనా కట్టడి నేపథ్యంలో పలు కళాశాలలు, విద్యా సంస్థలకు ఆయా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో, పరీక్షల కాలంలో ఈ విపత్తు వచ్చి పడడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇ-లెర్నింగ్ అమలుకు యోచిస్తున్నారు.
మొబైల్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ‘ఈ పరిస్థితులు ఆన్‌లైన్ సంస్థలకు వరంగా మారాయి. భారీ అవకాశాలు అందిపుచ్చుకునే సమయం వచ్చింది’ అని ఐటీ సంస్థ బ్లిస్ మార్కామ్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ తర్వాత భవిష్యత్తులో ఇ-లెర్నింగ్ విధానం కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.