COVID-19: కరోనా టెస్టులపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన

Make all Covid tests free for citizens suggests Supreme Court

  • కోవిడ్ పరీక్ష కోసం రూ.4500 వరకు వసూలు చేస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లు
  • పేదలకు ఆర్థికంగా భారమవుతోందన్న పిటిషనర్
  • రీయింబర్స్‌మెంట్ గురించి ఆలోచించాలన్న సుప్రీం కోర్టు

కోవిడ్-19 పరీక్ష సౌకర్యం పౌరులందరికీ ఉచితంగా లభించేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, ఒక్కో టెస్టుకు రూ.4500 వసూలు చేస్తున్నాయి. ఇది సామాన్యులకు భారంగా మారింది. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ శశాంక్ డియో అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారించిన కోర్టు.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే ప్రైవేటు ల్యాబ్‌లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌలభ్యంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల పౌరులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.

అలాగే, టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లు ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయకుండా నిరోధించాలని సూచించింది. ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్‌లకు రీయింబర్స్‌మెంట్ చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కోర్టు సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వద్ద తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లు ముందుకొచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని, ప్రభుత్వ ప్రయోగశాలల్లో పరీక్ష చేయించుకోవడం సామాన్యులకు కష్టంగా మారిందని న్యాయవాది శశాంక్ డియో సుధి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఇది వారికి ఆర్థికంగా మరింత భారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ఇది జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని పిటిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News