p.chidambaram: లాక్డౌన్ను కొనసాగిస్తామంటే సమర్థించే తొలి వ్యక్తిని నేనే: కాంగ్రెస్ నేత చిదంబరం
- లాక్డౌన్ కారణంగా దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు
- వారికి ఇస్తామన్న నగదును పంపిణీ చేయాలి
- నిరుద్యోగం 23 శాతం పెరిగింది
కరోనా వైరస్ మరింత ప్రబలకుండా దేశంలో ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ లాక్డౌన్ను ఎత్తివేయాలనే అంశం చర్చకు వస్తే, కొనసాగించాలని చెప్పే తొలి వ్యక్తిని తానే అవుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు.
లాక్డౌన్ నిర్ణయం ముమ్మాటికి సమర్థనీయమేనన్న చిదంబరం.. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. లాక్డౌన్ సందర్భంగా పేదలకు ఇస్తామన్న నగదును పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లాక్డౌన్ సమయంలో నిరుద్యోగం 23 శాతానికి పెరిగిందని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా దినసరి కూలీల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని చిదంబరం కోరారు.