india vs pakistan: కరోనాపై పోరుకు నిధుల కోసం ఇండో- పాక్ క్రికెట్ సిరీస్ జరపాలి: అక్తర్

Shoaib Akhtar proposes Indo Pak series to raise funds for fight against COVID19 pandemics
  • ఖాళీ స్టేడియంలో మూడు వన్డేల సిరీస్ ప్రతిపాదన
  • వచ్చే మొత్తాన్ని రెండు దేశాలకు పంచాలన్న మాజీ పేసర్
  • ఆపద వేళ  ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచన
కరోనా వైరస్‌ వ్యతిరేక పోరాటంలో భారత్, పాకిస్థాన్‌ లకు నిధులు సమకూర్చేందుకు చిరకాల ప్రత్యర్థులైన రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.  ఇండియా, పాక్ మధ్య మూడు మ్యాచ్‌ ల వన్డే సిరీస్‌ ఆడించి ప్రత్యక్ష ప్రసారం చేస్తే భారీ మొత్తం సమకూరుతుందని అన్నాడు. భారత్‌పై ఉగ్రదాడులు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో 2007 నుండి ఇండియా- పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోయింది. ఆసియా కప్‌, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే రెండు జట్లు తలపడుతున్నాయి.

ప్రస్తుత విపత్కర సమయంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్ జరగాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పిన అక్తర్.. ఈ సిరీస్ ఫలితం వల్ల రెండు దేశాల్లో ఎవ్వరూ నిరాశ చెందరని అన్నాడు. ‘ఒకవేళ కోహ్లీ సెంచరీ కొడితే మేం హ్యాపీ. అదే మా బాబర్ ఆజమ్ శతకం చేస్తే మీరు సంతోషిస్తారు. మైదానంలో ఏం జరిగినా ఇరు జట్లూ విజేతలుగా నిలుస్తాయి’ అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

ఈ సిరీస్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నాడు. ‘ఈ సిరీస్‌ను టీవీలో మాత్రమే చూసే అవకాశం కల్పించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కూర్చొని ఆట చూస్తారు.చాలా రోజుల తర్వాత ఇరు జట్లు తలపడుతాయి కాబట్టి వ్యూయర్ షిప్ కూడా భారీగా ఉంటుంది. ఈ సిరీస్‌ ద్వారా వచ్చే నిధులను కరోనాపై పోరాటానికి భారత్, పాక్ ప్రభుత్వాలకు సమానంగా పంచాలి’ అని మాజీ పేసర్ సూచించాడు.

రెండు దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా  ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారన్న అక్తర్ సిరీస్‌ను ఇప్పుడే కాకున్నా  పరిస్థితి కాస్త కుదుటపడ్డాక నిర్వహించాలని అన్నాడు. మ్యాచ్‌లను దుబాయ్‌ లాంటి తటస్థ వేదికపై షెడ్యూల్ చేయాలని.. ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను అక్కడికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సిరీస్‌ జరిగితే ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక క్రికెట్ కూడా తిరిగి మొదలయ్యేందుకు బీజం పడుతుందని అక్తర్ అన్నాడు. దానివల్ల  దాయాది దేశాల మధ్య దౌత్య సంబంధాలూ మెరుగవుతాయన్నాడు.

 ఇండో- పాక్ క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని తాము ప్రాతిపాదించినా.. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వాలే అన్నాడు. అలాగే, ఈ కష్టకాలంలో రెండు దేశాలు.. ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇండియా తమకు పదివేల వెంటిలేటర్లు అందిస్తే ఈ సాయాన్ని పాక్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నాడు.
india vs pakistan
Cricket
series
raise
funds
Corona Virus
fight
shoaib akhtar

More Telugu News