Bernie Sanders: అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న బెర్నీ శాండర్స్... ఇక ట్రంప్ వర్సెస్ బిడెన్!
- నవంబర్ లో జరగనున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికలు
- జో బిడెన్ కు మద్దతివ్వాలని బెర్నీ నిర్ణయం
- బహిరంగ సభలో మరిన్ని వివరాలు చెబుతానని వెల్లడి
యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ లో జరుగనుండగా, పోటీ ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ల మధ్య జరగడం ఖాయమైంది. వెర్మాంట్ ప్రాంత డెమోక్రాట్ నేత బెర్నీ శాండర్స్, పోటీ నుంచి తప్పుకుని, జో బిడెన్ కు తన మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం నాడు తన మద్దతుదారులకు, ప్రచార టీమ్ కు ఈ విషయాన్ని స్పష్టం చేసిన బెర్నీ శాండర్స్, తన నిర్ణయం వెనకున్న మరిన్ని కారణాలను ప్రజల ముందు వెల్లడిస్తానని తెలిపారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం జరగాల్సిన ప్రాథమిక ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగాల్సిన వ్యక్తి పేరును ఖరారు చేసేందుకు నిర్వహించే కన్వెన్షన్ జూలై నుంచి ఆగస్టుకు వాయిదా పడింది.
ట్రంప్ పై పోటీ చేసేందుకు సుమారు 12 మందికి పైగా డెమోక్రాట్ ప్రతినిధులు ఆసక్తి చూపగా, ఆపై ఒక్కొక్కరూ వైదొలిగారు. చివరకు జో బిడెన్, బెర్నీ శాండర్స్ నిలువగా, వీరిద్దరి మధ్యా ఎంతో పోటీ నెలకొంది. అయితే, ఇటీవలి కాలంలో జో బిడెన్ ప్రచారంలో దూసుకెళ్లడం, ప్రజల నుంచి ఆయనకు మద్దతు పెరగడంతో బెర్నీ శాండర్స్ తప్పుకున్నారు.
బెర్నీ శాండర్స్ యూఎస్ లో స్థిరపడిన భారతీయుల నుంచి, ముఖ్యంగా వామపక్ష భావజాలమున్న విద్యార్థులు, ఉన్నత విద్యావంతుల నుంచి మద్దతు కూడగట్టుకోగలిగారు. ఇప్పుడు వారంతా జో బిడెన్ కు మద్దతివ్వనున్నారు. ఇండియా ఎదుర్కొంటున్న దేశవాళీ సమస్యలపై శాండర్స్ వామపక్ష ధోరణిని ప్రదర్శించడం, మోదీ సర్కారుకు కొంత మేరకు అసంతృప్తిని కలిగించింది కూడా.
ఇక జో బిడెన్ కు ప్రస్తుతం 77 సంవత్సరాలు (నవంబర్ 20న ఆయన 78వ ఏట ప్రవేశిస్తారు). అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అత్యధిక వయసున్న అభ్యర్థిగా బిడెన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇక ఇదే సమయంలో ట్రంప్ వయసు 73 సంవత్సరాలు (జూన్ 14కు) కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇద్దరు వయో వృద్ధులు పోటీ పడుతున్నట్టే లెక్క!