Lockdown: అక్టోబర్ 15 వరకూ రెస్టారెంట్ల మూత... వైరల్ అయిన వార్తపై వివరణ!

Fake News on Restaurents Closed

  • లాక్ డౌన్ నేపథ్యంలో మూతబడిన హోటళ్లు, రెస్టారెంట్లు
  • టేక్ అవే, అత్యవసర ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు
  • పొడిగింపు వార్తలు అవాస్తవమని వివరణ

కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమలవుతున్న వేళ, ఎన్నో రకాల తప్పుడు వార్తలు, సమాచారం సోషల్ మీడియా వారధిగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా అటువంటిదే. లాక్ డౌన్ నేపథ్యంలో, ప్రజలు గుమికూడటాన్ని నివారించేందుకు అక్టోబర్ 15 వరకూ అన్ని రకాల రెస్టారెంట్లు, హోటల్స్ ను మూసి ఉంచుతారన్న వార్త తెగ వైరల్ అయింది. ఈ మేరకు విడుదలైన ఆర్డర్ కాపీ ఇదేనంటూ, ఓ ఫొటో కూడా తెగ షేర్ అయింది.  

ఇక ఇది తప్పుడు వార్తని, అటువంటి నిర్ణయమేదీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని ప్రభుత్వ రంగ 'ప్రసార భారతి న్యూస్ సర్వీస్' స్పష్టం చేసింది. లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారి కోసం ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంగా తెలిపిందని, ఇదే సమయంలో కూర్చుని తినే సౌకర్యాన్ని మాత్రం కల్పించవద్దన్న ఆదేశాలు అమలులో ఉన్నాయని స్పష్టం చేసింది. నిత్యావసర విభాగంలోకి వచ్చే ఫుడ్ డెలివరీకి అనుమతిచ్చామని పేర్కొంది.  

ఇండియాలో ఇప్పటికే 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య సైతం 100 దాటింది. కేంద్రం విధించిన మూడు వారాల లాక్ డౌన్ మార్చి 14తో ముగియనుండగా, మరికొంత కాలం దీనిని పొడిగించవచ్చని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ త్వరలో లాక్ డౌన్ ఎత్తివేసినా, రెస్టారెంట్ల వ్యాపారం తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం పట్టవచ్చని యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన భారత రెస్టారెంట్ పరిశ్రమ, లాక్ డౌన్ కారణంగా దాదాపు 9 బిలియన్ డాలర్ల వరకూ నష్టపోయిందని ఎన్ఆర్ఏఐ (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News