Madhya Pradesh: కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్ సచిన్ నాయక్....మీకు హ్యాట్సాప్!
- భోపాల్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలు
- కుటుంబ సభ్యులకు సోకరాదని ఈ నిర్ణయం
- ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో వైరల్
వృత్తిపట్ల అంకిత భావం, కుటుంబం పట్ల అభిమానాన్ని సమన్వయం చేసుకుంటూ ఓ వైద్యుడు తన కారునే ఇల్లుగా మార్చుకున్నాడు భోపాల్ లోని జేపీ ఆసుపత్రి వైద్యుడు సచిన్ నాయక్. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో పలువురు వైద్యులు, సిబ్బంది అవిశ్రాంతంగా బాధితులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా వైద్యులు, సిబ్బందికి కూడా కరోనా సోకుతోందన్న వార్తలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి.
కానీ ప్రస్తుత సంక్షోభ సమయంలో వృత్తికి న్యాయం చేయకుండా ఉండలేని డాక్టర్ సచిన్ నాయక్, అదే సమయంలో కుటుంబ రక్షణ బాధ్యత కూడా తనపై ఉందని భావించి కారునే ఇల్లుగా మార్చుకుని కొన్నాళ్లుగా అందులోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. తనకు కావాల్సిన నిత్యావసరాలు, పుస్తకాలన్నీ కారులోనే ఏర్పాటు చేసుకున్నారు.
కుటుంబ సభ్యులను కలవడం లేదు. ఆయన కార్లో కూర్చుని పుస్తకం చదువుతున్న ఓ ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో ఆ వైద్యుని అంకితభావంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోపాటు పలువురు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.
'కోవిడ్ 19ను తరిమికొట్టేందుకు పోరాడుతున్న సైనికులు మీరు. మధ్యప్రదేశ్ ప్రజలందరి తరపున మీకివే మా ధన్యవాదాలు. ఈ యుద్ధం త్వరగా ముగియాలని, మనం విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని సీఎం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు సచిన్ నాయక్ పై ప్రశంసలు కురిపిస్తూనే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక వసతి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
అప్పుడే వారు మరింత చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి మెరుగైన వైద్యం అందించగలరని అన్నారు. కాగా, సచిన్ నాయక్ వంటి వైద్యుల పరిస్థితిని చూసిన పలు హెూటళ్లు తాము ఇటువంటి వారికి ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తామని ముందుకు వచ్చాయి.