London: ఒకప్పుడు విదేశీ వైద్యులపై వ్యతిరేకత.. ఇప్పుడు వారే యూకేలో ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు!
- విదేశీయులు తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని నాడు ఆందోళన
- నేడు అదే విదేశీయులు ప్రాణాలు కాపాడుతున్నందుకు చప్పట్లు
- వైద్యులతో పాటు విదేశీ నర్సులు కూడా మృతి
యూకేలో ఎమిమిది మంది విదేశీ వైద్యులు కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. విదేశీ వైద్యులపైనే బ్రిటన్ అధికంగా ఆధారపడుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు వారే యూకేకు కీలకంగా మారారు. యూకేలో కొన్నాళ్లుగా వలస వ్యతిరేక సెంటిమెంట్ బాగా పెరిగిపోయింది. అయితే, కరోనా నేపథ్యంలో విదేశీ వైద్యులే ఈ దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కరోనాతో ఎనిమిది మంది విదేశీ వైద్యులు చనిపోవడం బ్రిటన్ వైద్య సేవల రంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఆ వైద్యులంతా ఈజిప్ట్, భారత్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, సుడాన్ దేశాలకు చెందినవారు. కరోనా వైరస్‌తో వణికిపోతున్న యూకేలో బాధితులకు సేవలందించడంలో ఇప్పుడు విదేశీ వైద్యులే ముందున్నారు.
'ఇప్పుడు యూకే ప్రజలు వీధుల్లోకి వచ్చి నేషనల్ హెల్త్ సర్వీస్‌పై ప్రశంసలు కురిపిస్తూ చప్పట్లు కొడుతున్నారు. కానీ, ఏడాదిన్నర క్రితం వారు బ్రెగ్జిట్ గురించి చర్చోపచర్చలు జరిపారు.. విదేశాల నుంచి తమ దేశానికి వచ్చిన వారు తమ ఉద్యోగాలకు ఎలా ఎసరు పెడుతున్నారన్న విషయంపై చర్చలు జరుపుకున్నారు' అని ఇటీవల లండన్‌లో మృతి చెందిన ఆదిల్ ఎల్ తయర్ అనే ఓ వైద్యుడి సోదరుడు డాక్టర్ హిషం ఎల్ ఖిదిర్ మీడియాకు తెలిపారు.
ఇప్పుడు అదే విదేశీ వైద్యులు ఇప్పుడు యూకేలోని ప్రజలతో కలిసి కరోనాపై పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న వారిలో వారే ముందున్నారని తెలిపారు. విదేశీ వైద్యులే కాకుండా విదేశీ నర్సులు కూడా యూకేలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు.