Corona Virus: మరిన్ని నగరాలు, రాష్ట్రాల్లో ‘మాస్కుల నిబంధన’!
- ముంబై బాటలో ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా
- జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగులు మాస్కులు ధరించడం తప్పనిసరి
- లడఖ్‌లో ఆర్మీ సహా అందరూ ధరించాల్సిందే
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంతో పాటు వివిధ ఆంక్షలు విధిస్తున్నాయి.
ఈ క్రమంలో ముంబైలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ ముఖానికి ప్రొటెక్టివ్ మాస్కులు ధరించాలన్న నిబంధనను తప్పని సరి చేశారు. ఇప్పుడు దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని షరతు పెడుతున్నాయి. ఢిల్లీ నగరంతో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు ధరించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, ఆర్మీ కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టం చేసింది. మరో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయానికి వచ్చే స్టాఫ్, సందర్శకులకు ‘మాస్కుల నిబంధన’ అమలు చేయాలని నిర్ణయించారు.