Sri Lanka: ప్రాణాలు కాపాడే ఔషధాలు, రక్షణ సామగ్రి పంపారు: ఫొటోలు పోస్ట్ చేసి భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు

Sri Lanka Thanks India For Sending Life Saving Medicines President Rajapaksa Issues Post

  • శ్రీలంక వినతి మేరకు పంపిన భారత్‌
  • పెద్ద ఎత్తున శ్రీలంకకు చేరుకున్న రక్షణ పరికరాలు, ఔషధాలు
  • సంక్షోభ పరిస్థితుల్లో గొప్ప సాయాన్ని అందించారన్న రాజపక్స  

కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తమ ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఔషధాలు పంపి భారత్‌ చేసిన సాయానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స  కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకలోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ దేశానికి పది టన్నులతో కూడిన కరోనా నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలతో పాటు ఔషధాలు, వైద్యుల రక్షణ సామగ్రి, మాస్కులను శ్రీలంకకు భారత్ తాజాగా ప్రత్యేక విమానంలో పంపించింది. తమను ఆదుకోవాలని ఇటీవల భారత్‌కు శ్రీలంక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని పంపింది.

                                            
'భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం, ప్రజలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీలంకకు ప్రత్యేక విమానం ద్వారా అవసరమైన ఔషధాలు పంపి భారత్ సాయం చేసింది. కొవిడ్‌-19తో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో గొప్ప సాయాన్ని అందించారు' అని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ట్వీట్ చేశారు.
                  భారత్ పంపిన వైద్య పరికరాలు, ఔషధాల ఫొటోలను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. 'శ్రీలంక ప్రజలకు, ప్రభుత్వానికి భారత ప్రజలు, ప్రభుత్వం పంపుతున్న గిఫ్ట్‌' అని ఓ లేఖను కూడా శ్రీలంకకు భారత్ పంపింది. దాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో శ్రీలంకతో పాటు అమెరికా, బ్రెజిల్ వంటి పలు దేశాలు కూడా భారత సాయాన్ని కోరిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News