kapil dev: భారత్‌కు డబ్బు అవసరం లేదు: కపిల్ దేవ్
- అక్తర్.. ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ ప్రతిపాదనపై స్పందన
- విరాళాల కోసం క్రికెటర్ల ప్రాణాలను రిస్క్ చేయొద్దన్న లెజెండ్
- బీసీసీఐ ఇప్పటికే రూ.51 కోట్లు ఇచ్చిందని వెల్లడి
భారత్, పాకిస్థాన్ దేశాల్లో కరోనాపై పోరాటానికి విరాళాలు సేకరించడం కోసం రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య సిరీస్ ఏర్పాటు చేయాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు. మూడు వన్డేల సిరీస్‌ను దుబాయ్ లాంటి తటస్థ వేదికపై ఖాళీ స్టేడియంలో నిర్వహించాలన్నాడు. దాని ద్వారా వచ్చే విరాళాలను ఇరు దేశాలకు సమానంగా పంచాలని సూచించాడు. ఈ ప్రతిపాదనపై భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. భారత్‌కు డబ్బు అవసరం లేదన్నాడు. అదే సమయంలో క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
‘క్రికెట్ సిరీస్ అనేది అక్తర్ అభిప్రాయం మాత్రమే. కానీ, మనం ఇప్పుడు విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఇప్పుడు ముఖ్యం. కరోనా కట్టడి చర్యలపై రాజకీయ నాయకులు ఇప్పటికీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. ముందు ఇది ఆగాలి. ఏదేమైనా కరోనాపై పోరాటానికి బీసీసీఐ ఇప్పటికే భారీ మొత్తం (రూ. 51 కోట్లు) సాయం చేసింది. అవసరమైతే ఇంకా విరాళం ఇచ్చే స్థాయిలో ఉంది. దానికి విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.