DHFL: లాక్ డౌన్ సమయంలో అబద్ధాలు చెప్పి ప్రయాణించిన ముంబై బిలియనీర్ల అరెస్ట్!
- ముంబై నుంచి మహాబలేశ్వర్ ఫామ్ హౌస్ కు ప్రయాణం
- ఐదు వాహనాల్లో వంటవాళ్లు, సెక్యూరిటీతో సహా చేరుకున్న ఫ్యామిలీ
- స్థానికులు ఇచ్చిన సమాచారంతో అదుపులోకి
- క్వారంటైన్ ముగిసిన తరువాత సీబీఐ అదుపులోకి
ఎన్నో ఆర్థిక మోసాలకు పాల్పడి, ప్రస్తుతం పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న ముంబయి బిలియనీర్లు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్, ధీరజ్ వాధ్వాన్ తదితరులు, లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా, 23 మంది కుటుంబ సభ్యులతో 250 కిలోమీటర్లు ప్రయాణించినందుకు ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
డీహెచ్ఎఫ్ఎల్-యెస్ బ్యాంక్ కుంభకోణంలో భాగమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు, ముంబై నుంచి 5 వాహనాల్లో బయలుదేరి సతారా జిల్లా, మహాబలేశ్వర్ సమీపంలోని తమ ఫామ్ హౌస్ కు చేరుకోగా, అక్కడి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
బుధవారం రాత్రి వీరు మహాబలేశ్వర్ చేరుకున్నారని, వారి కుటుంబానికి స్నేహితుడైన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తా నుంచి 'ప్రయాణం అత్యవసరం' అంటూ, పాస్ లను తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. వాధ్వాన్ ఫ్యామిలీ, వారి వంట మనుషులు, సేవకులు ఖండాలా ప్రాంతం నుంచి వాహనాల్లో మహా బలేశ్వర్ కు వచ్చారని.. పూణె, సతారా జిల్లాలను సీజ్ చేసినా, వీరు ప్రయాణం సాగించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
పట్టుబడిన 23 మందిలో ఇటలీకి చెందిన ఓ బాడీగార్డ్ కూడా ఉన్నాడని, వీరందరిపైనా కేసులను నమోదు చేసి, అందరినీ క్వారంటైన్ సెంటర్ కు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ కేసుల్లో కపిల్, ధీరజ్ వాద్వాన్ లపై సీబీఐ ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులను జారీ చేసింది. ఇక, వీరి క్వారంటైన్ ముగియగానే, కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. గత నెలలో వీరిని విచారించాలన్న ఉద్దేశంతో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, వాటిని తీసుకోకుండా నిందితులు తప్పించుకున్నారు.
ఐపీఎస్ అధికారిని సెలవుపై పంపిన ప్రభుత్వం
ఇక వాద్వాన్ కుటుంబానికి ప్రయాణ పాస్ లను మంజూరు చేసిన ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తా వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో విచారణకు ఆదేశిస్తూ, ఆయనను తప్పనిసరి సెలవుపై పంపించినట్టు ప్రభుత్వం పేర్కొంది.