Nimmagadda Ramesh: ఏపీ ఎస్ఈసీ నియామకంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్.. రమేశ్ కుమార్ కు పదవీగండం?
- ఏపీ పంచాయతీ రాజ్ యాక్టు-1994 సవరణకు ఆర్డినెన్స్
- దీని ప్రకారం హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తే ఎస్ఈసీ కి అర్హుడు
- ఎస్ఈసీ ప్రస్తుత పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే యోచన
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎస్ఈసీ పదవీ కాలం, అర్హత, నియామక పద్ధతికి సంబంధించిన ఏపీ పంచాయతీ రాజ్ యాక్టు-1994 ను ప్రభుత్వం సవరించనున్నట్టు సమాచారం. స్వతంత్ర, న్యాయమైన, తటస్థ వ్యక్తి ఈ పదవిలో ఉండేలా ప్రతిపాదిత ఆర్డినెన్స్ ను తేనున్నట్టు తెలుస్తోంది.
దీని ప్రకారం హైకోర్టులో జడ్జిగా పని చేసిన వ్యక్తి మాత్రమే ఎస్ఈసీగా నియామకానికి అర్హులుగా ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాకు తక్కువకాని పదవిలో పనిచేసిన వారిని మాత్రమే ఎస్ఈసీ గా నియమిస్తున్నారు. అందువల్ల, బ్యూరోక్రాట్స్ మాత్రమే ఈ పదవికి అర్హులుగా ఉన్నారు.
ప్రతిపాదిత ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవీకాలాన్ని కూడా ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని చూస్తున్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది కానీ, అది ఆరేళ్లకు మాత్రం మించకూడదు. ఎస్ఈసీ జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ హైకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఏపీలో గత నెల 21, 23, 27, 29 తేదీల్లో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ సంస్థల ఎన్నికలను ‘కరోనా’ కారణంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఈ ప్రతిపాదిత ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ జారీ అయిన వెంటనే ప్రస్తుత ఎస్ఈసీ రమేశ్ కుమార్ ను తొలగించి, ఆయన స్థానంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఎవరినైనా నియమించే అవకాశం కనిపిస్తోంది.