Facebook: యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను తీసుకువస్తున్న ఫేస్ బుక్

Facebook Wants You to Spend Less Time on Facebook And is Adding a New Quiet Mode
  • ఫేస్ బుక్ నుంచి క్వైట్ మోడ్ ఫీచర్
  • యూజర్ల సమయ నియంత్రణ కోసం ఉపయుక్తం
  • ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు మాత్రమేనన్న ఫేస్ బుక్
చాలామంది సోషల్ మీడియాలో నిత్యం గంటలకొద్దీ గడుపుతుంటారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో పోస్టులు, న్యూస్ ఫీడ్, కామెంట్లు, వీడియోలతో సమయం ఇట్టే కరిగిపోతుంది. అయితే ఇలా అనవసరంగా సమయం వృథా అవుతోందన్న ఉద్దేశంతో ఫేస్ బుక్ కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. దీనిపేరు క్వైట్ మోడ్. ఫేస్ బుక్ లో యూజర్లు గడిపే కాలాన్ని ఈ ఫీచర్ తో నియంత్రించవచ్చు. దీన్ని ఫేస్ బుక్ యాప్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఓ గంట పాటు ఫేస్ బుక్ చూడకూడదని మీరు టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్ ను ఆన్ చేస్తే, ఆ గంట పాటు మీరు ఫేస్ బుక్ ను చూడడం వీలు కాదు సరికదా,  ఫేస్ బుక్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రావు.

అంతేకాదు, క్వైట్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు ఫేస్ బుక్ లోకి వెళ్లాలనుకుంటే వెంటనే మీకు హెచ్చరిక వస్తుంది. మీరు సెట్ చేసిన టైమ్ పూర్తయ్యే వరకు ఫేస్ బుక్ చూడడం కుదరదు అంటూ సందేశం వస్తుంది. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ ఆరోగ్య విభాగం హెడ్ కాంగ్ జింగ్ జిన్ తెలిపారు. ప్రస్తుతానికి క్వైట్ మోడ్ ఫీచర్ ను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ మే నెలలో అందుబాటులోకి వస్తుంది.
Facebook
Quite Mode
New Feature
IPhone
Android

More Telugu News