Kanna Lakshminarayana: ఎస్ఈసీపై ఎందుకింత కక్ష కట్టాడో అర్థం కావడంలేదు: కన్నా
- రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందంటూ విమర్శలు
- ఇది సీఎం అహంకారానికి నిదర్శనం
- వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెడుతున్నారంటూ మండిపాటు
రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని మండలినే రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎస్ఈసీపై కక్ష సాధించారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు ఎన్నికల కమిషన్ స్పందించలేదని, అన్యాయంగా ఏకగ్రీవాలైన సందర్భంలోనూ నోరు మెదపలేదని, మరి ఇన్ని దుర్మార్గాలకు సహకరించిన ఎన్నికల కమిషనర్ పై ఇంతలా ఎందుకు కక్షబూనాడో అర్థం కావడంలేదని అన్నారు.
"ఎలక్షన్ కమిషనర్ ను విమర్శించాల్సింది మేము. బీజేపీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది. ఒకరకంగా ఎన్నికల సంఘం ఈ ప్రభుత్వానికి ఎంతో మేలు చేసింది. వైసీపీ అభ్యర్థుల దుర్మార్గాలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారంటూ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. అలాంటి ఎన్నికల కమిషనర్ పై ఇలాంటి చర్య ఉంటుందని ఊహించలేకపోయాం" అని అన్నారు.
ఇది సీఎం అహంకారానికి నిదర్శనమని, రాష్ట్ర విభజన తర్వాత ఇంతటి దుర్గతి ఎప్పుడూ పట్టలేదని, ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో అనిపిస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. తనకు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి తాను తలచిందే రాష్ట్రంలో జరగాలని అనుకుంటున్నాడని, వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెడుతున్నారని విమర్శించారు. 15 రోజుల లాక్ డౌన్ కే జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చాడని, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి పట్టిన చీడ అని అభివర్ణించారు. తాజా పరిణామాలపై తాను గవర్నర్ కు లేఖ రాస్తున్నానని కన్నా వెల్లడించారు.