Corona Virus: సగం మందికి కరోనా ఖాయమని చెప్పిందన్న పంజాబ్ సీఎం... తామసలు అధ్యయనమే చేయలేదన్న వర్శిటీ!
- సెప్టెంబర్ రెండో వారానికి గరిష్ఠస్థాయికి వైరస్
- పంజాబ్ లో 87 శాతం మందికి వైరస్ సోకనుందని వ్యాఖ్య
- మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఖండించిన వర్శిటీ
ఇండియాలోని జనాభాలో 58 శాతం మందికి కరోనా వైరస్ సోకుతుందని పీజీఐఎంఈఆర్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించగా, అసలు తాము అటువంటి స్టడీ ఏదీ చేయలేదని సదరు వర్శిటీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమరీందర్ సింగ్, ఈ అధ్యయనం ప్రకారం, సెప్టెంబర్ రెండోవారానికి వైరస్ వ్యాప్తి గరిష్ఠానికి చేరుతుందని, ఆ సమయానికి దేశవ్యాప్తంగా 58 శాతం మందికి, పంజాబ్ లో 87 శాతం మందికి వైరస్ సోకుతుందని అధ్యయనం వెల్లడించిందని తెలిపారు.
"కొవిడ్ 19 మహమ్మారి, ఇండియాను కబళించనుంది. పీజీఐఎంఈఆర్ లో భాగమైన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఈ అంచనాలు విడుదల చేసింది" అని అమరీందర్ వ్యాఖ్యానించారు. అమరీందర్ వ్యాఖ్యలు వైరల్ కాగా, చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న పీజీఐఎంఈఆర్, ఓ ప్రత్యేక మీడియా ప్రకటన విడుదల చేసింది. తమ ఫ్యాకల్టీ సభ్యులు లేదా కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారెవరూ ఈ అధ్యయనం చేయలేదని స్పష్టం చేసింది. అసలు కరోనాపై తాము ఎన్నడూ అంచనాలను విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
అమరీందర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించగా, సీఎం మీడియా సలహాదారు వరీన్ థుక్రాల్ స్పందించారు. అమరీందర్ చేసిన వ్యాఖ్యలు పీజీఐఎంఈఆర్ హెల్త్ ఎకనామిక్స్ అదనపు ప్రొఫెసర్ అంచనాలని వివరణ ఇచ్చారు.