Narendra Modi: లాక్డౌన్ పొడిగింపుపై వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు
- లాక్డౌన్ పొడిగింపుపై కీలక చర్చలు
- ముఖానికి మాస్కుతో పాల్గొన్న మోదీ
- తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని వ్యాఖ్య
- లాక్డౌన్ ఎత్తేస్తే కొత్త సమస్యలు రాకుండా చూడాలని సూచన
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్ను కట్టడి చేయడానికి, ప్రజల సమస్యలను తీర్చడానికి తాను 24 గంటలూ అందుబాటులోనే ఉంటానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్లో కీలక చర్చలు జరుపుతున్నారు. ముఖానికి మాస్కు ధరించి మోదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే దేశంలో ఏ విధమైన కొత్త సమస్యలూ రాకుండా చూడాలని మోదీ అన్నారు.
లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.
లాక్డౌన్ను పొడిగించాలా? వద్దా అన్న విషయంమై నేడు మోదీ ప్రకటన చేయనున్నారు. సీఎంలతో సమావేశం ముగిసిన అనంతరం లేక ఈ రోజు రాత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. లాక్డౌన్ను పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించే అవకాశం ఉందా? అన్న అంశంపై కూడా ప్రజల్లో ఉత్కంఠ ఉంది.
లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మోదీ ఏ నిర్ణయం తీసుకుంటున్నారన్న దానిపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పలువురు సీఎంలు లాక్డౌన్ పొడిగించాలనే మోదీని కోరారు.