bihar: సామాజిక దూరం నిల్: కూరగాయల మార్కెట్లో గుంపులు గుంపులుగా జనం.. వీడియో ఇదిగో
- బీహార్లో ఘటన
- కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలు
- కనీస జాగ్రత్తలూ తీసుకోని వైనం
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్ను కట్టడి చేయడానికి విధించిన లాక్డౌన్, సామాజిక దూరం పాటింపు.. వంటి నిబంధనలను దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బీహార్లో రాజధాని పాట్నాకు సమీపంలోని దిఘా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. జాతర జరుగుతోందా? అన్నంత రద్దీ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సామాజిక దూరమా? అంటే ఏంటీ? అన్నట్లుగా ప్రజలు వ్యవహరించారు.
జనాలు గుమికూడకుండా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతోనే ప్రజలు ఇలా గుంపులు గుంపులుగా కూరగాయలు కొనడానికి వచ్చారని విమర్శలు వస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూరగాయలు కొనడానికి వచ్చినట్లే ప్రజలు ఈ రోజు ఉదయం అక్కడకు చేరుకున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బీహార్లో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు.