Lockdown: అనారోగ్యంతో అప్పుడే పుట్టిన శిశువును బైకుపై తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన డాక్టర్!
- మహారాష్ట్రలో ఘటన
- అంబులెన్సు కూడా అందుబాటులో లేని వైనం
- శ్వాస తీసుకోవడంలో శిశువు ఇబ్బంది
- 1.5 కిలోమీటర్లు బైకుపై వేరే ఆసుపత్రికి తీసుకెళ్లిన వైద్యుడు
అప్పుడే పుట్టిన శిశువును ఓ వైద్యుడు స్వయంగా బైకుపై వేరే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అలీభాగ్ ప్రాంతంలో ఓ మహిళ ఓ ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే వైద్యులు ఆ శిశువును ద్విచక్ర వాహనంపై తీసు కెళ్లాల్సి వచ్చింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వినియోగించడంతో పలు చోట్ల అత్యవసర వాహనాలు కూడా అందుబాటులో లేవు. చివరకు నర్సింగ్ హోం వద్ద కూడా అంబులెన్సు లేకపోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... శ్వేతా పాటిల్ అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను అలీభాగ్‌లోని నర్సింగ్ హోంలో ఆమె భర్త కేతన్ చేర్పించాడు. ఆమెకు ఏడాది క్రితం ఓ శిశువు జన్మించి మృతి చెందింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ హోంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కాన్పు చేశారు.
'నా భార్య శ్వేతకు మధుమేహం ఉంది.. దాన్ని కంట్రోల్‌లో ఉంచడానికి వైద్యులు ఔషధాలు ఇచ్చారు' అని కేతన్ చెప్పాడు. ' ఆమె మెడికల్ హిస్టరీని చూసి చికిత్స అందించాం. ఆమెకు మొదటి సారి డెలివరీ చేసిన గైనకాలజిస్టు మళ్లీ డెలివరీ చేసింది. ఆమె పిల్లల వైద్యులను పిలిచింది. ఆ బాలుడు సాధారణ బరువుతోనే పుట్టాడు. అయితే, ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాడు. శరీర రంగు మారిపోతోంది' అని ఓ వైద్యుడు తెలిపారు.
ఆ శిశువుకి టీటీఎన్ చికిత్స వెంటనే అవసరం. ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి లాక్‌డౌన్ వల్ల వాహనాల సదుపాయం లేదు. దీంతో ఆ నర్సింగ్ హోంకు 1.5 కిలోమీటర్ల దూరంలోని చందోర్కర్ ఆసుపత్రికి బైకుపై తీసుకొచ్చారు. ఆ శిశువును చేర్చుకుని ఎన్‌ఐసీయూలో చికిత్స అందించాం. ఆక్సిజన్ అందించాం.. 12 గంటల్లో శిశువు పరిస్థితి నిలకడకు వచ్చింది' అని ఆ వైద్యుడు తెలిపారు.