Nasser Hussain: ధోనీ ఒక్కసారి రిటైర్మెంట్ ప్రకటించాడంటే అతడ్ని మళ్లీ తీసుకురాలేం: నాసిర్ హుస్సేన్
- ధోనీ రిటైర్మెంట్ పై కొనసాగుతున్న చర్చ
- తరానికి ఒక్కసారే ఇలాంటి దిగ్గజాలు వస్తారన్న నాసిర్ హుస్సేన్
- ధోనీలో ఇప్పటికీ టాలెంట్ ఉందని వెల్లడి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు రిటైర్ అవుతాడన్న అంశంపై చర్చకు ఇప్పట్లో ముగింపు కార్డు పడేట్టు లేదు. ధోనీ హవా ముగిసిందని, ఇక వీడ్కోలు పలకడమే తరువాయి అని ఓ వర్గం వాదిస్తుండగా, ధోనీ వంటి అనుభవజ్ఞుడి సేవలు ఏ జట్టుకైనా ఎంతో ఉపయుక్తమని మరో వర్గం అంటోంది. ఇక ఈ చర్చలోకి ఇంగ్లాండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ కూడా వచ్చి చేరారు. ధోనీని బలవంతంగా రిటైర్మెంటు దిశగా నడిపించడం సరైన విధానం కాదని, ఒక్కసారి ధోనీ రిటైర్మెంటు ఇచ్చాడంటే ఇక అతడ్ని తీసుకురావడం బ్రహ్మతరం కూడా కాదని అన్నారు.
క్రికెట్ లో ఉన్నప్పుడే అతడి సేవలు వినియోగించుకోవాలని, తాను చూస్తున్నంతవరకు ధోనీలో క్రికెట్ ఆడే శక్తి అపారంగా ఉందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై వైఫల్యంతో ధోనీ ఆటతీరును నిర్ణయించలేమని, ధోనీలో ఇప్పటికీ ప్రతిభ పుష్కలంగా ఉందని తెలిపారు. ధోనీ రిటైర్ కావాల్సిందేనని అంటున్నవారు అతడు నిజంగానే రిటైర్మెంట్ ప్రకటిస్తే తిరిగి తీసుకురాలేమని గ్రహించాలని హితవు పలికారు. కొందరు దిగ్గజాలు తరానికి ఒక్కసారే ఉదయిస్తారని, అలాంటివారిలో ధోనీ ఒకడని కొనియాడారు. తన పరిస్థితి ఏమిటో ధోనీకి తెలుసని, చివరికి ఏ నిర్ణయమైనా సెలెక్టర్లు తీసుకుంటారని నాసిర్ హుస్సేన్ వివరించారు.