Corona Virus: ఇటలీలో ఆగని మరణాలు.. మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

Italy extends national lockdown to May 3 as COVID19 deaths mount to 18849

  • వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినా  వెనక్కు తగ్గని ప్రభుత్వం
  • మరికొన్ని రోజులు ఆంక్షలు తప్పవని ప్రధాని కాంటే ప్రకటన
  • చిన్న వ్యాపార సముదాయాలు తెరిచేందుకు అనుమతి

కరోనా కారణంగా  భారీగా ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్న ఇటలీలో  దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించారు. కరోనా కట్టడి కోసం దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఈ నెల 13వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే,   రోజూ వందలాది మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో మే మూడో తేదీ వరకూ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని ఇటలీ ప్రధాని గియుసేప్ కాంటే ప్రకటించారు.

ఈ విషయంలో వ్యాపార వర్గాల నుంచి  తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన తలొగ్గలేదు. కరోనా కారణంగా శుక్రవారం మరో 570 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించిన తర్వాత కాంటే లాక్‌డౌన్‌పై నిర్ణయం ప్రకటించారు. ఇటలీలో దాదాపు లక్షన్నర మందికి కరోనా సోకగా.. ఇప్పటికే 18,500 పైచిలుకు మరణాలు సంభవించాయి.

అంతకుముందు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఇటలీ పారిశ్రామిక రంగంలో 45 శాతం ఉత్పత్తి చేసే బిజినెస్ యూనియన్లు.. కాంటేపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆంక్షలు ఇలానే  కొనసాగితే కార్మికులకు జీతాలు ఇవ్వలేమని ప్రధానికి లేఖ రాశాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని కాంటే స్పష్టం చేశారు.

అందుకే మరో మూడు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నానని చెప్పారు. ఇది కఠిన నిర్ణయమే అయినా తీసుకోక తప్పలేదని చెప్పారు.  అదే సమయంలో చిన్న వ్యాపారులకు  మాత్రం కాంటే కాస్త ఊరట కలిగించారు. మంగళవారం నుంచి బుక్ షాపులు, పిల్లల బట్టల దుకాణాల వంటి చిన్న వ్యాపార సముదాయాలను ప్రయోగత్మకంగా తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News