Narendra Modi: జీవితంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే!: ప్రధాని మోదీ
- సీఎంలతో వీడియో కాన్ఫెరెన్స్ వేళ కీలక వ్యాఖ్యలు
- ఆర్థిక వృద్ధి కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డ మోదీ
- లాక్ డౌన్ ను పాక్షికంగా సడలిస్తారని ఊహాగానాలు
ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ పొడిగించబడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదుకానీ, అత్యధిక రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలనే ప్రధాని నరేంద్ర మోదీని కోరాయి. ఇదే సమయంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో, లాక్ డౌన్ ను కొంతమేరకు సడలించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇండియాలో మూతబడ్డ పరిశ్రమలు, దేశం ముందు నిలిచిన సవాళ్లు, ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా చర్చ జరిగింది. ఆ సమయంలోనే మోదీ తన మనసులోని మాటను బయట పెట్టారు.
మార్చి 24న తాను దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, లాక్ డౌన్ ను ప్రకటించిన వేళ, "జీవించి ఉంటే సంపాదించగలం" అని పిలుపునిచ్చినట్టు గుర్తు చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లాక్ డౌన్ తప్పనిసరని తాను అన్నానని, ఇప్పుడు మాత్రం 'జీవితంతో పాటు ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమే' అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలంతా ఒకేతాటిపై నడవాలని కూడా ప్రధాని సూచించారు.
ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతుందన్న నిపుణుల అంచనాల మేరకు, వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేలా లాక్ డౌన్ నిబంధనలను కొంత మేరకు సవరించ వచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తి 4.8 శాతానికి పతనమైందని, నిరుద్యోగ రేటు 7.2 నుంచి 10.4 శాతానికి పెరిగిపోయిందని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఇక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే, కేంద్రమే కల్పించుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికరంగం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇక పలు రాష్ట్రాలు కోరినట్టుగా పూర్తి లాక్ డౌన్ ను కొనసాగిస్తారా? లేక సడలింపులుంటాయా? అన్న విషయం మోదీ స్వయంగా ప్రకటిస్తేనే తెలుస్తుందనడంలో సందేహం లేదు. మోదీ ప్రకటన కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.