Luv Aggarwal: లాక్ డౌన్ వల్ల ఎంత మేలు జరిగిందో వివరించిన లవ్ అగర్వాల్
- లాక్ డౌన్, కట్టడి చర్యలు లేకుంటే 8.2 లక్షల కేసులుండేవని వెల్లడి
- కేవలం కట్టడి చర్యలు తీసుకుని ఉంటే 1.2 లక్షల కేసులుండేవని వివరణ
- లాక్ డౌన్, కట్టడి చర్యలే కీలకంగా మారాయన్న లవ్ అగర్వాల్
కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించకపోయి ఉంటే ఈ పాటికి లక్షల మంది కరోనా బారినపడేవారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం వల్లే భారత్ లో కరోనా తీవ్రత తగ్గిందని తెలిపారు. లాక్ డౌన్, కట్టడి చర్యలే కీలకంగా మారాయని అభిప్రాయపడ్డారు.
లాక్ డౌన్ అమలు చేయకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ 15 నాటికి దేశంలో 8.2 లక్షల పాజిటివ్ కేసులు ఉండేవని, ఒకవేళ లాక్ డౌన్ విధించకుండా కేవలం కట్టడి చర్యలు మాత్రమే తీసుకుని ఉంటే ఏప్రిల్ 15 నాటికి 1.2 లక్షల కేసులు ఉండేవని వివరించారు.
లాక్ డౌన్ కు ముందు కరోనా వ్యాప్తి రేటు 28.9%గా ఉందని, లాక్ డౌన్ విధించకపోయుంటే అది అమాంతం పెరిగిపోయేదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 7,447 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని, లాక్ డౌన్, కట్టడి చర్యలు తీసుకోవడం వల్లే కరోనా నిదానించిందని పేర్కొన్నారు.